దేశంలో 2017-18తో పోలిస్తే 2018-19లో రూ.500 నోట్లకు గాను నకిలీ నోట్ల సంఖ్య ఏకంగా 121 శాతం పెరిగిందని ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడైంది. అలాగే రూ.2వేల నకిలీ నోట్ల సంఖ్య 21.85 శాతం, రూ.200 నకిలీ నోట్ల సంఖ్య ఏకంగా 16011 శాతం పెరిగిందట.
ప్రధాని నరేంద్ర మోదీ 2016, నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ప్రజలకు అనూహ్యమైన షాకిచ్చిన సంగతి తెలిసిందే. నకిలీ నోట్లను నియంత్రించడం, అవినీతి, నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో మోదీ సహా ఆయన కేబినెట్‌లోని మంత్రులందరూ ఆ చర్యను సమర్థించారు. అయితే రాను రాను పెద్ద నోట్ల రద్దు వల్ల ఎంతటి దుష్పరిణామాలు ఎదురవుతున్నాయో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. నల్లధనం ఏమాత్రం బయటికి రాకపోగా, ఇప్పుడు మళ్లీ పెద్ద ఎత్తున నకిలీ నోట్లు చెలామణీ అవుతున్నాయట. సాక్షాత్తూ ఆర్‌బీఐ విడుదల చేసిన ఓ నివేదికే ఈ విషయాన్ని మనకు తెలియజేస్తోంది.
దేశంలో 2017-18తో పోలిస్తే 2018-19లో రూ.500 నోట్లకు గాను నకిలీ నోట్ల సంఖ్య ఏకంగా 121 శాతం పెరిగిందని ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడైంది. అలాగే రూ.2వేల నకిలీ నోట్ల సంఖ్య 21.85 శాతం, రూ.200 నకిలీ నోట్ల సంఖ్య ఏకంగా 16011 శాతం పెరిగిందట. దీన్ని బట్టి చూస్తే నోట్ల రద్దు సమయంలో మోదీ చెప్పిన నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట అనే అంశం ఒక విఫలమైన చర్యగా మారిందని మనకు తెలుస్తుంది.
ఇక దేశంలో 2018-19 కాలంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో జరిగిన మోసాల విలువ రూ.71,542 కోట్లని తేలిందని ఆర్‌బీఐ తన నివేదికలో తెలిపింది. 2017-18లో ఇవే మోసాల విలువ రూ.41,167 కోట్లు ఉండగా ఈ ఏడాది అది ఇంకా పెరగడం గమనార్హం. అయితే ఎస్‌బీఐ సహా ఇతర అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో మోసాలు జరిగాక సగటున 22 నెలల వరకు ఆ మోసాల గురించి బ్యాంకులకు తెలియడం లేదని కూడా ఆర్‌బీఐ తెలిపింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆర్థిక మాంద్యం మరింత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ముందు ముందు కఠినతరమైన నిర్ణయాలు తీసుకోకపోతే దేశంలో నకిలీ నోట్లు, నల్లధనం పెరిగిపోవడమే కాదు, ప్రజలకు ఆర్థికంగా మరిన్ని సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇక మోదీ పెద్ద నోట్ల రద్దు సమయంలో చెప్పిన అంశాల్లో ఏ ఒక్కటీ నెరవేరకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది..!