మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఆదివారం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చెరువులో మునిగి మృతి చెందారు. ముంబయికి 630 కిలోమీటర్ల దూరంలోని నాందేడ్ జిల్లాలోని కంధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవరంగ్‌పురా ప్రాంతంలో మధ్యాహ్నం 2.45 గంటలకు ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బడి దర్గా వద్ద ప్రార్థనలు చేసేందుకు వెళ్లారు. తిరిగి వస్తూ దాదాపు మధ్యాహ్నం 2.45 గంటలకు కంధర్ చెరువు వద్ద భోజనాలు చేయడానికి ఆగారు. అందులో ఒకరు టిఫిన్ బాక్స్ కడగడం కోసం చెరువు దగ్గరికి వెళ్లారు. ఈ క్రమంలోనే అనుకోకుండా నీటిలో పడిపోయారు. ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు కుటుంబ సభ్యులు చెరువులోకి దూకారు. వీరంతా మునిగిపోవడం చూసి.. ఒడ్డున ఉన్న మరో ఇద్దరూ నీళ్లలోకి దూకారు. ఈ ఘటనలో అందరూ మృతి చెందారని పోలీసులు తెలిపారు.