ఈ రోజు అర్ధరాత్రి నుండి మన దేశంలో అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలు పూర్తిగా నగదు రహితంగా నడవనున్నాయి. ఫాస్టాగ్ లేకుండా టోల్‌ప్లాజాల్లోకి వాహనాలను అనుమతించరు. ఇప్పటికే దాదాపుగా అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ఉంది. లేని వారు ఇబ్బంది పడకుండా టోల్ గేట్ల వద్ద విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
నిజానికి గతంలో జనవరి 1నుంచి దీన్ని అమలు చేయగా తర్వాత పొడిగించింది. అయితే ఈ ఫాస్టాగ్ విధానంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరో సారి క్లారిటీ ఇచ్చారు. ఫా స్టాగ్ పొడిగింపు ఉండదనీ.. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు ఫాస్టాగ్ గడువును పెంచామని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి వాహనాలకు ఫాస్టాగ్ లేకుంటే రెట్టింపు రుసుము చెల్లించాల్సిందేనన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.