ఎన్నిచట్టాలు తీసుకువచ్చినా.. ఎన్ని కఠిన శిక్షలు విధించినా మృగాళ్లు మాత్రం మారడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి కన్నుమిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. ఓ బాలికపై తండ్రీకొడుకులిద్దరూ అత్యాచారానికి పాల్పడ్డ అమానవీయ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. శివకుమార్(45), కుమారుడు శ్యామల్(19) అనే ఇద్దరు వ్యక్తులు కొంపల్లిలో నివాసముంటున్నారు. వీరు ఉంటున్న ఇంటి పక్కనే ఓ బాలిక ఉంటోంది. ఆమెకు ఫోన్ ఇస్తామని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లారు. అనంతరం బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బాలికను హెచ్చరించారు.
అయితే గత రెండు మూడు రోజుల బాలిక ప్రవర్తనలో తేడా వచ్చింది. ఏమైందని తల్లి గట్టిగా ప్రశ్నించగా, జరిగిన ఘోరాన్ని వివరించింది. దీంతో బాధితురాలి తల్లి పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తండ్రీకుమారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.