మీరు తీసుకునే ఆహారం సంతాన సమస్యలను దూరం చేస్తుందన్న విషయం తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతుండడం నిజమే. హార్వర్డ్ మెడికల్ స్కూలు వారి అధ్యయనంలో ఈ విషయం కనుక్కున్నారు. సంతాన సమస్యలకి కారణాలుగా ఉండే వయసు, జీన్స్ మొదలగు వాటిని మార్చలేకపోవచ్చు. కానీ మీరు తీసుకునే ఆహారాల్లో మార్పులు తీసుకొస్తే ఇలాంటి ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం పుష్కలంగా ఉంది. పోషకాహార నిపుణుల ప్రకారం ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12, ఒమెగా 3కొవ్వు ఆమ్లాలు సంతాన సమస్యలను దూరం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
ఇంకా విటమిన్ డి, యాంటీఆక్సిడెంట్లు, పాల పదార్థాలు, సోయా, కాఫీ మొదలగునవి సంతాన ప్రాప్తిపై చాలా తక్కువ ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని సార్లు ఎలాంటి ప్రభావాన్ని చూపకపోవచ్చు. మాంసం, చక్కెర పదార్థాలు, చక్కెర కలిగిన పానీయాలు, బంగాళ దుంపలు సంతాన ప్రాప్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని కనుక్కున్నారు. కాఫీ తాగే అలవాటు ఉన్నవారు రోజుకి ఒక కప్పు మాత్రమే తాగాలని చెబుతున్నారు. ఎక్కువ కప్పుల కాఫీ దుష్ప్రభావాలకి దారి తీస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల నాణ్యత పెరుగుతుంది. కార్బోనేటెడ్ పానీయాలు, మద్యపానం సంతాన ప్రాప్తిని మరింత ఆలస్యం చేస్తాయి. ఇంకా సోడాలు, ఎనర్జీ డ్రింకులు ఆడవాళ్ళపై బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తిని, పండ్లు తక్కువ తినే ఆడవాళ్లలో సంతానం ఆలస్యంగా జరుగుతుంది వివరించారు. ప్యాకేజీ, ప్రాసెస్ ఫుడ్ అస్సలు ముట్టుకొవద్దు. బొప్పాయి గింజలు మగవాళ్ళలో వీర్యకణాలను తగ్గించే ప్రమాదం ఉంది. ఫైనాఫిల్ లో ఉండే బ్రోమిలేన్ వల్ల రక్తం పలుచగా మారి రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది అని తెలిపారు.