కొత్త..పాత..వలస నేతలతో టీఆర్ ఎస్‌పార్టీ నిండుకుండలా తయారైంది. ఓడినవారు..గెలిచిన వారు ఒకే పార్టీలో కొనసాగుతుండటంతో విభేదాలు పొడచూపుతున్నాయి. ఆధిపత్యం కోసం గెలిచిన ఎమ్మెల్యేలు…ఉనికి చాటుకునేందుకు మాజీ ఎమ్మెల్యేలు, దీర్ఘకాలంగా రాజకీయాల్లో, పార్టీలో కొనసాగుతూ అవకాశం రాక ఎదురుచూస్తున్న నేతల మధ్య కోల్డ్‌వార్ కంటిన్యూ అవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో వారసత్వం రాజకీయాలు కూడా తీవ్రప్రభావం చూపుతుండటం గమనార్హం. మొత్తంగా ఈ పరిణామాలు టీఆర్ ఎస్ అధిష్ఠానానికి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది.
ఈ చిక్కుముడులకు చెక్ పెట్టలేక ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లు తలలు పట్టుకుంటున్నారు. అంతా కలసి కట్టుగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని సూచిస్తున్నా…ముందు తలాడించి నియోజకవర్గంలో మాత్రం తాము ఏం చేయ దల్చుకున్నారో అదే చేస్తుండటం గమనార్హం. పదవుల్లో లేక పాత వాళ్ళు పరేషాన్ అవుతుంటే.. కొత్త వాళ్ళు పాత నేతలను పట్టించుకోకపోవడం.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, పార్టీ కమిటీల్లో మాజీ ఎమ్మెల్యేలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో కొత్త వివాదాలు మొదలయ్యాయి. వర్గ రాజకీయాలను పెంచిపోషిస్తున్నారని సమాచారం.
నిత్యం ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకోవడం పరిపాటిగా మారిందంట. కొంతకాలంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి తలెత్తుతోంది. ఎమ్మెల్యే హర్ష వర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. హర్ష వర్ధన్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి వర్గంలో చేరడాన్ని జూపల్లి వర్గం జీర్ణించు కోలేకపోతున్నట్లు తెలుస్తోంది. కొల్లాపూర్ కోట వివాదంలో మాజీ మంత్రి బహిరంగంగా సభలు పెట్టి మరి ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం.
ఇక పాలేరు నియోజక వర్గంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు యాక్టివ్‌గా మారుతుండటంతో కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే కందాడి ఉపేందర్ రెడ్డి వర్గం మండిపోతోందంట. తుమ్మలకు చెక్ పెట్టే ప్రయత్నంలో ఆయన్ను ఎక్కడకు పిలవడం లేదంట. దీనిపై మాజీ మంత్రి కూడా అంతే ఎత్తులతో నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా ఆయన వర్గానికి చెందిన వారికే సంస్థాగత పదవులను కేటాయిస్తున్నారట. దీంతో వీరిమధ్య గట్టిగానే రాజకీయ యుద్ధం సాగుతోందంట.
డోర్నకల్ నియోజకవర్గంలో మంత్రి సత్యవతిరాథోడ్.. ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆధిపత్య ప్రదర్శనకు దిగుతున్నారు. రెడ్యా కూతురు ఎంపీ మాలోతు కవిత ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చే ప్రయత్నం చేస్తున్నా అవేవీ ఫలించడం లేదని సమాచారం. దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి పడడం లేదు. ఇక మరో మంత్రి మల్లారెడ్డికి జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. ఆదిలాబాద్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు గొడవలు ఉన్నాయి. ఇలా చాలా నియోజకవర్గాల్లో టీఆర్ ఎస్ అధిష్ఠానానికి తలనొప్పులు తప్పడం లేదంట.