తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇచ్చేలా పద్దు ఉంటుందని తెలిపారు. బడ్జెట్ దస్త్రాలతో ఇంటి నుంచి బయలుదేరిన ఆయన..కేంద్రం సహకరించకున్నా ప్రజాసంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ముందుగా జూబ్లీహిల్స్ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న హరీశ్ రావు.. అనంతరం అసెంబ్లీకి చేరుకున్నారు.
అక్కడ మొదట శాసనమండలి ఛైర్మన్‌ను మంత్రి ప్రశాంత్ రెడ్డితో సహా కలిశారు. ఇరువురు బడ్జెట్ ప్రతులను మండలి ఛైర్మన్‌కు అందజేశారు. అనంతరం శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి.. పద్దు ప్రతులు సమర్పించారు. మరి కాసేపట్లో శాసనసభలో మంత్రి హరీశ్ రావు.. మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రాధాన్య పథకాలు, సంక్షేమం, హామీల అమలుకు ఈ పద్దులో పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 11వ బడ్జెట్ ఇది.