ఓ చర్చిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని 41 మంది అక్కడికక్కడే సజీవ దహనమైన ఘటన ఈజిప్టులోని కైరోలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది దుర్మరణం పాలయ్యారు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇక్కడి అబు సిఫైనే చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, దాంతో తప్పించుకునే వీల్లేక పదుల సంఖ్యలో మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని చర్చి వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేసింది.
ఈ ఘటనపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన స్థలంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. కాగా, ఈ చర్చి కాప్టిక్ ప్రజలకు చెందినది. మధ్యప్రాచ్యంలో కాప్టిక్ వర్గం అత్యంత పెద్దదైన క్రైస్తవ సమాజంగా గుర్తింపు పొందింది. ఈజిప్టు జనాభా 103 మిలియన్లు కాగా, అందులో 10 మిలియన్ల మంది కాప్టిక్ ప్రజలే. అయితే, ముస్లిం మెజారిటీ దేశం ఈజిప్టులో కాప్టిక్ ప్రజలపై హింస చోటుచేసుకుంటోంది.