కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులు రాజకీయం వేడెక్కింది. అయితే.. మునుగోడు ఉప ఎన్నిక రాబోయే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఈ ఉప ఎన్నికను రాజకీయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ సహా.. కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు మునుగోడు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. తాజాగా తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి నేడు నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని ఉద్ఘాటించారు. మునుగోడులో బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని ఎద్దేవా చేశారు జగదీశ్ రెడ్డి.
ఈడీ పేరు చెప్పి భయాందోళనలకు గురిచేయాలనుకుంటున్నారని, ఈడీ బోడీలకు భయపడే ప్రసక్తేలేదని అన్నారు. ఈడీని బీజేపీ తన జేబు సంస్థగా మార్చుకుందని విమర్శించారు జగదీశ్ రెడ్డి. కేసీఆర్ ఎవరికీ లొంగే రకం కాదని అన్నారు జగదీశ్ రెడ్డి. బీజేపీ దుర్మార్గాలను బయటపెట్టే సత్తా సీఎం కేసీఆర్ కు మాత్రమే ఉందని పేర్కొన్నారు జగదీశ్ రెడ్డి. ఈ పోరాటంలో వామపక్షాలు తమతో కలిసి వస్తాయని ఆశిస్తున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. బీజేపీని ఓడించడమే లక్ష్యమని సీపీఎం, సీపీఐ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు జగదీశ్ రెడ్డి.