సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. డైమండ్ పాయింట్ వద్ద ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బుదవారం సాయంత్రం భారీగా పొగలు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దట్టమైన పొగలతో చుట్టుపక్కల మబ్బులను తలపించింది. దీంతో అర కిలోమీటరు మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆఫీస్ రూమ్ పూర్తిగా దగ్ధం కాగా, ఆ సమయంలో స్కూల్‌లో సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.
వెంటనే మంటలను గమనించి వారు బయటకు వెళ్లిపోగా ప్రాణాలతో బయట పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. అయితే లాక్ డౌన్ కారణంగా స్కూల్లో పిల్లలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు.