అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెంలో ఆదివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణరెడ్డిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు ఆదిత్యరెడ్డి దుండగులను ప్రతిఘటించారు. దీంతో దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు.
బాధితులు కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు పారిపోతుండగా వారి వద్ద నుంచి ఓ సంచి పడిపోయింది. దాన్ని పరిశీలించగా అందులో 2 నాటు బాంబులు, జామర్ ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. ఘటనాస్థలంలో సీసీకెమెరాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.