ఓట్ల వేటలో వరద రాజకీయం..ఇంతకీ ఏం జరిగింది

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వరద రాజకీయం నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా బాధితులకు సాయం అందించవచ్చని చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం అంతలోనే మనసు మార్చుకుంది. ఇంతకీ ఏం జరిగింది. వరద సాయాన్ని ఎవరు ఆపారు..టీఆర్ఎస్ బీజేపీ ఆరోపణల్లో అసలు నిజమేంటి..


మహానగరం హైదరాబాద్‌లో అక్టోబర్ నెలలో అసాధారణ స్థాయిలో వర్షాలు కురిశాయి. వందేళ్లలోనే అంతటి వర్షాలను మహా నగరం చూడటం రెండోసారి మాత్రమే. కలుషిత కాసారంగా మారిన మూసీ నది… పిల్లకాలువగా ఉన్న తన రూపును మార్చుకొని నదిని తలపించింది. ఉగ్రరూపం దాల్చి… ఉప్పొంగి ప్రవహించింది. ఊరు ఏరైంది. నగరం నీరైంది. హైదరాబాద్‌లోని వందలాది కాలనీలన్నీ వరద ముంపులో చిక్కుకొని వారాల పాటు విలవిలలాడాయి.

హైదరాబాద్‌లో అసాధారణ వర్షాలతో అపారనష్టం జరిగింది. ఇదే సమయంలో నగర కార్పొరేషన్‌కు ఎన్నికలు రావడంతో.. ఇప్పుడంతా వరద రాజకీయమే నడుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ వరదలే ప్రధాన అజెండాగా చేసుకొని అధికార విపక్షాలు ఎన్నికల రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. వరదల్లో చిక్కుకొని సర్వం నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉండటం లేదని విమర్శలు రావడంతో.. బాధితులను ఆదుకునేందుకు 10వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది కేసీఆర్ సర్కార్. వరదల బారిన పడ్డ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 10 వేల చొప్పున నగదు సహాయం అందజేస్తోంది. ఇందుకోసం 550 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు 4 లక్షలకు పైగా కుటుంబాలకు సాయం అందించినట్లు ప్రభుత్వ వర్గాలే తెలిపాయి.

వరదసాయం దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణలతో… మీ సేవలో బాధితులు అప్లై చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా మీసేవల ముందు సందడి మొదలైంది. నగరంలోని వరద బాధితులు మీ సేవల ముందు బారుల తీరారు. కిలోమీటర్ల కొద్దీ క్యూలు కట్టారు. మూడునాలుగురోజుల నుంచి హైదరాబాద్ లోని అన్ని మీసేవ కేంద్రాల వద్ద వందలాది మంది లబ్ధిదారులు పత్రాలు చేతపట్టి గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చున్నారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో… అప్పటికే పంపిణీ అమల్లో ఉండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అభ్యంతరం తెలపలేదు. అయితే వరదసాయాన్ని నేరుగా ఇవ్వకుండా అకౌంట్‌లో జమచేయాలని సూచించింది.

జీహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడంపై విపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి. సాయం పంపిణీలో స్థానిక టీఆర్‌ఎస్‌ నేతల ప్రమేయం కనిపిస్తోందని, మరోవైపు అధికారులు పలు చోట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని, అర్హులకు సాయం అందించడం లేదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలతో జీహెచ్ఎంసి పరిధిలో వరద సహాయాన్ని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఎస్ఈసీ ఆదేశించింది. దీనిపైనా రాజకీయ రగడ రాజుకుంది.

ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేయడం వల్లే సిటీలో పేదలకు వరదసాయం పంపిణీ ఆగిపోయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఎన్నికలను అడ్డం పెట్టుకుని కుట్రచేశారన్న కేసీఆర్‌.. పేదల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకపోతే వేలమంది పేదలకు సాయం అందేదన్నారు. వరదసాయం పంపిణీ ఆగిపోవడానికి బీజేపీయే కారణమన్న కేసీఆర్‌ ఆరోపణల్ని తప్పుబట్టారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించారు. దీనిపై పోలీసులను కూడా ఆశ్రయిస్తానన్నారు. వరదసాయాన్ని ఆపాలంటూ తాను లేఖ రాసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు.

టీఆర్ఎస్, బీజేపీనే కాదు … మిగిలిన పార్టీలు సైతం వరదలనే అంశంగా చేసుకొని గ్రేటర్ ఎన్నికల రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. అటు ఎన్నికల వేళ వరదబాధితులకు అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఇదే అంశంపై హామీలు గుప్పిస్తున్నాయి. తమను గెలిపిస్తే బాధితులందరికీ వరద సాయం అందిస్తామని ప్రకటిస్తున్నాయి. మొత్తానికి గత నెలలో నగరాన్ని కుదిపేసిన వరదలు.. ఇప్పుడు గ్రేటర్ రాజకీయాన్ని ఊపేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news