జూపార్క్‌ను తలపిస్తున్న చీకోటి ఫాంహౌస్‌ : అటవీ శాఖ అధికారులు

-

క్యాసినో ఏజెంట్‌ చీకోటి ప్రవీణ్‌ నివాసంలో ఈడీ సోదాలు ముగిసిన తర్వాత, అతని ఫాంహౌస్‌పై అధికారులు దృష్టి సారించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో 20 ఎకరాల్లో ఉన్న చీకోటి ప్రవీణ్‌ ఫాంహౌస్‌లో శుక్రవారం జంతు అక్రమ రవాణా నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫాం హౌస్‌లో మాట్లాడే రామచిలుకలు, ఉడుములు, ఊసరవెల్లులు, బల్లులు, ఆస్ట్రిచ్‌, గుర్రాలు, కుక్కలు, ఆవులు ఇతర జంతువులను బంధించినట్టు అధికారులు గుర్తించారు. ఇత్తడి కళాకృతులు, పురాతన రథం ఉన్నట్టు తెలిపారు.

మినీ జూపార్క్‌ను తలపించేలా అక్కడి పరిస్థితి ఉన్నట్టు తెలిసింది. కందుకూరు అటవీ రేంజ్‌ అధికారులతో పాటు జంతు అక్రమ రవాణా నియంత్రణ అధికారులు, విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ జంతువులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఫాంహౌస్‌ నిర్వహిస్తున్నారనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

క్యాసినో ఏజెంట్లు ప్రవీణ్‌ చీకోటి, మాధవరెడ్డిలకు ఈడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో తమ ఎదుట సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 8గంటలకు నుంచి ప్రారంభమైన ఈడీ సోదాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. ఐఎస్‌ సదన్‌లోని ప్రవీణ్‌ ఇంటితో పాటు కడ్తాల్‌లో ఉన్న ఆయన ఫాంహౌస్‌లోనూ సోదాలు చేశారు. బోయిన్‌పల్లిలోని మాధవరెడ్డి ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. 8 బృందాలుగా ఏర్పడిన ఈడీ అధికారులు 16గంటలకు పైగా తనిఖీలు చేశారు. ప్రవీణ్‌ ఇంట్లో చరవాణి, ల్యాప్‌టాప్‌తో పాటు ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డి నివాసంలో బ్యాంకు పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ అధికారులు ప్రాథమికంగా తేల్చారు.

ఈఏడాది జనవరి, జూన్‌ మాసాల్లో ప్రవీణ్‌, మాధవరెడ్డి కలిసి నేపాల్‌లో భారీ ఎత్తున క్యాసినో నిర్వహించినట్టు ఈడీ అధికారులు తేల్చారు. దీనికోసం పలువురు సినీ తారలను ప్రచారకర్తలుగా ఉపయోగించుకున్నారు. వారి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచి.. తెలుగు రాష్ట్రాల్లో చాలామందిని ఆకర్షించారు. శంషాబాద్‌ నుంచి నేపాల్‌కు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి క్యాసినోకు తీసుకెళ్లినట్టు ఈడీ గుర్తించింది. నేపాల్‌, థాయ్‌లాండ్‌, ఇండోనేషియాలో జరిగే క్యాసినోలకు ఇక్కడి నుంచే పేకాటరాయుళ్లను తీసుకెళ్లి భారీగా డబ్బు వసూలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news