ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన రెండు, మూడు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సోనియాగాంధీతో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీసుకున్న కీలక నిర్ణయాలపై సోనియాగాంధీ పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, సీఎంగా ఓ వెలుగు వెలిగిన కిరణ్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమికి గురయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి మరోసారి పిలుపు వచ్చింది. దీంతో ఆయన తిరిగి పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కానీ, తన సోదరుడు టీడీపీలో చేరడం, కాంగ్రెస్ పార్టీకి అనుకూలత లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి అంతగా రాణించలేదు.
రాష్ట్ర పదవులు స్వీకరించాలని తెలిపినా ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి పిలుపు వచ్చింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం త్వరలో ఖాళీ కానున్న నేపథ్యంలో.. పార్టీ పగ్గాలు కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.