న్యూఢిల్లీ : భారత మాజీ ఉపరాష్ట్రపతి అమీద్ అన్సారీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆయన ఓ జాతీయ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన తాజా ఇంటర్వ్యూలో దేశంలో లౌకికవాదం, ముస్లింల రక్షణ వంటి విషయాలపై అన్సారీ సుదీర్ఘంగా మాట్లాడారు. భారతదేశంలో ముస్లింలు సురక్షితంగా లేరని తన 2017 ప్రకటనను ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.
ప్రస్తుత ప్రభుత్వ డిక్షనరీలో లౌకికవాదం అనే పదానికి తావులేకుండా పోయిందన్నారు. 2014కు ముందు ఉన్న ప్రభుత్వ డిక్షనరీలో లౌకికవాదం అనే పదం ఉందా అన్న ప్రశ్నకు…ఉంది, కానీ పూర్తిగా కాదంటూ పేర్కొన్నారు. తాను ఉపరాష్ట్రపతిగా ఉన్న చివరి వారంలో రెండు ఘటనలు కొన్ని వర్గాల్లో ఆగ్రహానికి కారణమయ్యాయనీ, తన ప్రకటన వెనుక రహస్య ఎజెండా ఉందని దేశ ప్రజలు అనుకున్నారని ఆయన వివరించారు. ఆయన రాసిన పుస్తకం బై మెనీ ఎ హ్యాపీ యాక్సిడెంట్: రీకలెక్షన్ ఆఫ్ ఎ లైఫ్‌లో ఆయన ప్రధాని మోడీతో సంభాషించిన అంశాలను ప్రస్తావించారు.
పదేండ్లు ఉప రాష్ట్రపతిగా, ఎంఎంయూ వీసీగా, మైనార్టీ కమిషన్ చీఫ్‌గా, దౌత్యవేత్తగా పని చేశారు. అయితే మీరు పదవిలో ఉన్న చివరి రోజుల్లో ముస్లింలకు రక్షణ లేదని ఎందుకు అనాల్సివచ్చిందని ప్రశ్నకు అన్సారీ స్పందిస్తూ.. తాను ప్రజల అభిప్రాయాల ఆధారంగానే ఆ ప్రకటన చేశానంటూ.. ముస్లింలపై జరిగిన దాడులను గుర్తు చేశారు. గతంలోనూ అన్సారీ ఇలాంటి వ్యాఖ్యలే చేయగా.. తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.