ఇరాక్‌లోని కిర్కుక్ నగరంలో ఉగ్ర దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు సైనికులు దుర్మరణం చెందారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది. దాదాపు 10 నెలల అనంతరం ఇరాన్‌లో మరోసారి తుపాకుల మోత వినిపించడంతో కిర్కుక్ నగర వాసులు భయాందోళనకు గురయ్యారు.
ఇరాక్‌లోని కిర్కుక్ నగరానికి సమీపంలోని చెక్‌పోస్టును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అక్కడ విధుల్లో ఉన్న సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు సైనికులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. బాంబులతో దాడులు జరిపిన ఉగ్రవాదులు సైనికుల వద్ద ఉన్న ఆయుధాలు, కమ్యునికేషన్ పరికరాలను ఎత్తుకెళ్లారు.
దాదాపు 10 నెలల క్రితం జనవరిలో కూడా ఇదే తరహా దాడి జరిగింది. క్యూబా నగరంలోని అల్-అజీమ్ జిల్లాలోని బ్యారక్‌లను ఐఎస్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. నిద్రిస్తున్న సైనికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఓ గార్డుతోపాటు 11 మంది సైనికులు మరణించారు.