కుప్పకూలిన నాలుగు అంతస్తుల బిల్డింగ్.. శిథిలాల కింద 25 మంది.. ఒకరు మృతి!

మహారాష్ట్ర రాజధాని ముంబైలో అర్ధరాత్రి దారుణ ఘటన సంభవించింది. నాయక్‌నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. భవనం కూలిన సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు సిబ్బంది వెల్లడించింది.

కూలిన భవనం
కూలిన భవనం

శిథిలాల కింద 20 నుంచి 25 మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రెస్క్యూ టీమ్ సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలినట్లు సమాచారం అందిందని ఎన్‌డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ అశిష్ కుమార్ తెలిపారు. సమాచారం అందుకున్న మంత్రి ఆదిత్య ఠాక్రే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు ముంబైలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలకు గుర్తించాలని, ఆ ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయాలని సూచించారు.