మునుగోడు ఉపఎన్నిక పోరులో ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఈ నెల 31తో ప్రచారానికి తెరపడనుండటంతో పార్టీలన్నీ ప్రచార పర్వంలో మరింత దూసుకెళ్తున్నాయి. గ్రామగ్రామాన తిరుగుతూ పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ ఎలాగైనా మునుగోడులో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస రోడ్ షోలు చేస్తున్నారు.
ప్రచారంలో భాగంగా సామాజిక వర్గాల వారీగా టీఆర్ఎస్ పార్టీ ఓటర్లతో పార్టీలు సమావేశాలు నిర్వహిస్తోంది. మునుగోడులో బీసీ అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో ఆ సామాజికవర్గం ఓటర్లపై పార్టీలన్నీ కన్నేశాయి. మునుగోడు ఉపఎన్నిక క్రమంలో రంగారెడ్డి జిల్లా మన్నెగూడలోని బీఏంఆర్ సార్థ ఫంక్షన్ హాల్‌లో గౌడ ఆత్మీయ సమ్మేళనం సభను టీఆర్ఎస్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. కేటీఆర్ వెంట తాను లక్ష్మణుడిలా ఉంటానని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆ తర్వాత మాట్లాడిన కేటీఆర్.. శ్రీనివాస్ గౌడ్ కామెంట్లపై స్పందించారు. ‘ఈ మధ్యనే శీనన్న తాతయ్యాడు. అయినా ఇంక.. నన్ను రామన్నా అని పిలుస్తున్నాడు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలతో సభలో ఉన్న నాయకులందరూ నవ్వుకున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్లు గీత కార్మికుల సంక్షేమ కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు.