అధికారిక లాంచనాలతో గద్దర్ అంత్యక్రియలు రేపు మహాబోధి విద్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గద్దర్ మృతికి సంతాపం ప్రకటించిన కేసీఆర్.. ఈ మేరకు సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజాయుద్దనౌక, బాధిత, పీడిత వర్గాల పాటగాడు, విప్లవకారుడు గద్దర్ ఆకస్మిక మరణం చెందారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు. 1949 తూప్రాన్‌లో జన్మించారు. గద్దర్‌గా ప్రసిద్ధి చెందారు, ఒక భారతీయ కవి, విప్లవ బాలడీయర్, ఉద్యమకారుడు. 1987లో కారంచేడు దళితులహత్యలపై పోరాడిన గద్దర్.. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. తరువాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో చేరి.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు గద్దర్.
రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా అల్వాల్ వరకు అంతిమయాత్రను నిర్వహించనున్నారు. అంతిమయాత్ర మధ్యలో గద్దర్ పార్థీవదేహాన్ని భూదేవినగర్‌లోని ఆయన నివాసంలో కాసేపు సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం గద్దర్ భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. రేపు మధ్యాహ్నం వరకు అక్కడే గద్దర్ పార్థీవదేహం ఉండనుంది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో భౌతికకాయాన్ని ఉంచారు.