గుమ్మడి విఠల్ అని ఆయనను ఇకపై పిలవండి.గద్దర్ అని పిలవడం మానుకోండి.విఠల్ అనే కన్నా విఠలాచార్య అని పిలవండి అలా పిలిస్తే ఆయన ఆనందిస్తడు.సంతోషంతో ఉప్పొంగిపోతడు.అవును! గద్దర్ దారి మారింది. గద్దర్ ఇప్పుడు భక్తి పాటల కూర్పులో ఉన్నాడు. సమతామూర్తి దగ్గర పాటలు పాడుతున్నాడు.
శంషాబాద్ దారుల్లో పాడుతున్నాడు. వైష్ణవ గీతం పాడుతున్నాడు. వైష్ణవ ప్రభోదం చేస్తున్నాడు.ఆయనేం చేసినా అదంతా స్వామి భక్తి లో భాగం.ఆయన మారిపోయిండు అని చెప్పేందుకు ఉదాహరణ లేదా రుజువు. కనుక అడవి దగ్గర నిన్నటి పాటలు చెల్లవు. దండకారణ్యంలో నిన్నటి పాటలు అస్సలు వినపడవు. మాయం అయిపోయిన ఆ విప్లవ గీతం ఇప్పడు మార్పు చేసుకుని తనని తాను మార్చుకుని కొత్త పుంతలు అందుకుంటోంది. కనుక గద్దర్ ను మీరు కానీ నేను కానీ ఏమీ అనవద్దు.
కోటి దేవుళ్లకు దీపం పెట్టిన తెలంగాణలో వీరుల కథలు వినిపించిన సందర్భాల్లో గద్దర్ ఆవేదనలు విన్నాను.గద్దర్ అంటే విప్లవ కేక అని విన్నాను. ఆయన పిలుపునకు ఓయూ దద్దరిల్లిపోతుంది. కాకతి రుద్రమ్మ సంతోషిస్తుంది అని కూడా విన్నాను. కానీ అవన్నీ ఇప్పుడు లేవు రావు కూడా! మనిషే మారిపోయాక ఇక పాటదేముంది. ఇప్పుడు గద్దర్ నుంచి భక్తి గీతాల ప్రసారం జరగనుంది. కొత్త సాహిత్యం ఒకటి రానుంది.ఆయనను నమ్ముకున్న వారంతా ఇప్పుడు ఏడుస్తుంటారు. ఏడ్వనీ నేనేం చేయగలను అని ఓ అసక్తత గద్దర్ గళం నుంచి వస్తుంది.
అమ్మా తెలంగాణమా
ఆకలి కేకల గానమా
అని పాడిన రోజు తెలంగాణ నేల పొంగిపోయింది. కృష్ణమ్మ పరవళ్లు కానీ గోదావరి ఉరవళ్లు కానీ ఈ నేలను సస్యశ్యామలం చేయలేకపోతున్నాయి అని బాధపడినప్పుడు విన్నవారంతా కన్నీరుపెట్టారు. గద్దర్ పాటకు ఉత్సాహం గద్దర్ పాటకు ఉల్లాసం అన్నవే కాదు ఇంకా చాలా ఉన్నాయి.నిలదీసే లక్షణం, ప్రశ్నించే గుణం, వేదన చెందే సందర్భం ఇవన్నీ కూడా ఆ పాటలో నిభిడీకృతం అయి ఉంటాయి. నిక్షిప్తం అయి ఉంటాయి. కానీ ఇవాళ గద్దర్ మారిపోయిండు.ఆయన పాట పాటలా లేదు.
ఆయన మాట మాటలా లేదు.
ఇన్నేళ్ల కాల గతిలో గద్దర్ ను మీరు ఏమీ అనవద్దు అన్నమాట ఒకటి ప్రస్ఫుటంగా వినిపిస్తుంది.అంటే గద్దర్ తన కోసం మారలేదు.తన ఇంటి కోసం మారిపోయాడు.లేదా తన వారి సౌఖ్యం కోసం మారిపోయాడు.ఇంకా చెప్పాలంటే తన ప్రయోజనం కోసం మారిపోయాడు అని కూడా అనొచ్చు. ఏం కాదు అయినా కూడా గద్దర్ ఇవన్నీ పట్టించుకోడు.. పాట దారుల్లో నడుస్తాడు యాదాద్రి దారుల్లోనూ అన్నవరం కొండల్లోనూ ఆయన పాట ఉంటూనే ఉంటుంది. కొత్త రూపాన భక్తి కూడా విప్లవమే కదా అన్నది ఆయన భావన కావొచ్చు. అందుకు అన్నమయ్య ఓ ఉదాహరణ కావొచ్చు. నా గోడు దేవుళ్లు వింటరు.. ప్రజా దేవుళ్లు వింటరు అన్నది ఆయన భావన కావొచ్చు. ఇదే రేపటి వేళ స్థిరం కావొచ్చు