కేంద్రంలో ఎన్నిక జోరు వాడీవేడీగా కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మహాత్మాగాంధీ మనవడు గోపాల్‌కృష్ణ పేరు వినిపిస్తోంది. గోపాల్‌కృష్ణను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలపాలని వామపక్ష పార్టీల ముఖ్య నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గోపాల్‌కృష్ణను సంప్రదించగా.. కొద్ది రోజులపాటు సమయం ఇవ్వాలని.. తన ప్రతిపాదన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పినట్లు సమాచారం.
కాగా, ఐఏఎస్, మాజీ దౌత్యవేత్త గోపాల్‌కృష్ణ గాంధీ.. గతంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేశారు. 2017లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఆ సమయంలో ప్రత్యర్థి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా గెలిచారు. నేడు జరగబోయే విపక్షాల భేటీలో రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించబోయే ఈ భేటికి నాలుగు పార్టీలు దూరమయ్యాయి. టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేడీ, అకాలీదళ్ పార్టీలు గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కాంగ్రెస్ ఉన్నందుకే దూరమైనట్లు టీఆర్ఎస్ ప్రకటించింది.