ఆ ఊళ్లో పాలు, పాలతో తయారు చేసిన పదార్థాలు ఫ్రీ.. ఎందుకంటే..?

-

పాల ధరలు పెంచి ప్రభుత్వం సామాన్యులపై పెను భారం మోపింది. ఇదే అదనుగా భావించి కొందరు అధిక ధరలకు పాలను విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పాల కొరత కూడా ఏర్పడింది. పాలు, పాలతో తయారు చేసే పదార్థాలతో వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. అయితే ఓ ప్రాంతంలో మాత్రం పాల కొరత అస్సలు ఉండదు. ఆ ప్రాంతంలో పాలను అమ్మరు కూడా. ఎవరికైనా కావాలంటే ఉచితంగా ఇస్తారు. ఈ రోజుల్లో పాలను ఉచితంగా ఇవ్వడం అంటే విడ్డూరంగా ఉంది కదా. కానీ ఇది నిజం. మరి ఆ ప్రాంతం ఎక్కడుంది..? ఎందుకు పాలను ఫ్రీగా పోస్తారు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

కృష్ణుడి ఫేవరెట్ వెన్న. ఆ వెన్న పాలతో తయారవుతుంది. కేవలం వెన్న మాత్రమే కాకుండా కన్నయ్యకు పాలతో తయారయ్యే అన్ని పదార్థాలు ప్రియమే. అందుకే కిట్టయ్యకు సమర్పించే నైవేద్యాల్లో ఎక్కువ పాలతో తయారు చేసిన పదార్థాలే ఉంటాయి. అయితే కృష్ణభగవానుడి వారసులుగా చెప్పుకునే ఓ ప్రాంత ప్రజలు కన్నయ్యలాగే పాలకు, పాల పదార్థాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. వాటిని ఇష్టంగా తింటారు. కానీ నేటి తరం అంతా పాలను విక్రయిస్తూ వ్యాపారంగా మలుచుకుంది. కానీ కిట్టయ్య వారసులు మాత్రం పాలను ఫ్రీగా పోస్తారు. ఇంతకీ ఈ ప్రజలు ఎక్కడివారంటే.. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన గవాలీ గ్రామస్థులు.

గవాలీ గ్రామంలో.. పాలు, పాలతో తయారు చేసిన ప్రతిదీ ఉచితంగా ఇస్తారు. అంటే పాల వ్యాపారం లేదా దానితో తయారు చేసిన వస్తువులతో వ్యాపారం చేయడం గవాలీ వాసులు పాపంగా పరిగణిస్తారు. నీళ్లలో కూడా వ్యాపారం చేసే నేటి కాలంలో ఆ గ్రామంలో పాలు, పెరుగు, వెన్నె ఇలా వేటిని విక్రయించరు.

ఇక్కడి ప్రజలు తమను తాము శ్రీకృష్ణుని వారసులమని భావిస్తారు. అందుకే కిట్టయ్యకు ఇష్టమైన పాలు, పాలతో తయారు చేసిన పదార్థాలతో వ్యాపారం చేయరు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడ ఆవు పాలు, ఆవులు కూడా విక్రయించరు. ఇక్కడి పాలలో కల్తీ కూడా ఉండదు.

పాల వ్యాపారం చేయొద్దని శ్రీకృష్ణుడు చెప్పాడని గవాలీ గ్రామస్థులు అంటున్నారు. ఈ సంప్రదాయం తన పూర్వీకుల నుంచి వచ్చిందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news