మండలి రద్దుని కేంద్రం పట్టించుకోదు, ఆ విషయాన్ని జగన్ అంచనా వేయలేకపోయారు…!

-

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జరిగే నష్టాన్ని అంచనా వేయలేకపోయారని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కొద్దికాలం ఆగి ఉంటే వైసీపీకే మెజారిటీ వచ్చేదన్న ఆయన ఈ నిర్ణయంతో వైసీపీకే నష్టం వాటిల్లనుందని వ్యాఖ్యానించారు. మండలి చైర్మన్‌పై టీడీపీ ఒత్తిడి తీసుకురాలేదన్న గంటా… కౌన్సిల్‌లో టీడీపీకి మెజారిటీ ఉందన్నారు.

దాన్ని అధికార పార్టీ అంచనా వేయలేకపోయిందన్నారు. సెలెక్ట్ కమిటీ వ్యవహారం ఎప్పుడు తేలుతుందో తెలియదన్న ఆయన రాజధాని తరలింపు అంత త్వరగా అయ్యే పని కాదని, కోర్టులు కూడా హెచ్చరిస్తున్నాయని, విశాఖ పాలనా రాజధానిగా ఈ ప్రాంతవాసులుగా తాము స్వాగతిస్తున్నామన్నారు అయితే పార్టీ నిర్ణయం పార్టీదే అన్నారు ఈ విషయాన్ని ఎప్పుడో మా పార్టీ అధినేతకు చెప్పమని స్పష్టం చేసారు.

శాసన మండలి రద్దు సహేతుకంగా లేదని కేవలం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారన్న ఆయన, కోపంతో చేస్తున్నారే తప్ప మరేం లేదన్నారని వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ఆలోచన చేసి మండలిని తెచ్చారని గుర్తు చేసారు. వైఎస్ జగన్ దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం సబబు కాదని వ్యాఖ్యానించారు. మండలి రద్దు వెంటనే అమల్లోకి వచ్చే పరిస్థితి లేదన్నారు

ఎప్పటికి అమల్లోకి వస్తుందో కూడా తెలియదన్న ఆయన, ఇప్పటికే కేంద్రం వద్ద అనేక రాష్ట్రాలు కౌన్సిల్ వద్దని, కావాలనే ప్రతిపాదనను పెట్టాయని, అవన్నీ కూడా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని, అవన్నీ పెండింగ్‌లో ఉండగా.. మన రాష్ట్రం ప్రతిపాదన ఒక్కటే రద్దు చేస్తారని మాత్రం తాను అనుకోవట్లేదని, అసలు మండలి రద్దు ఇప్పట్లో అయ్యే వ్యవహారం కాదని గంటా వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news