గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ సత్తాచాటుతుంది? అధికార పార్టీ టీఆర్ ఎస్ గెలుపు సాధ్యమేనా? బీజేపీ దూకుడు చూపిస్తుందా? దుబ్బాక విజయాన్ని కొనసాగిస్తుందా? కాంగ్రెస్ పుంజుకుని పునర్‌వైభవం దిశగా అడుగులు వేస్తుందా? ఇదీ ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తున్న సందేహాలు, వినిపిస్తున్న ప్రశ్నలు. నువ్వా-నేనా అన్నట్టుగా సాగుతున్న గ్రేటర్ ప్రచారంలో పార్టీల దూకుడు మామూలుగా లేదు. స్థానిక ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలుగా మార్చేశారు. భారీ స్థాయిలో హామీలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ అన్ని ఫ్రీ అనే ప్రచారం చేస్తోంది. ఇప్పటికే నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తామని ప్రకటించారు కేసీఆర్.
ఇక, ఇప్పటికే వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఎందరు ఉన్నా.. ఇస్తామని ప్రకటించారు. అదేసమయంలో ఇంటి, నాలా పన్నులను తగ్గించేశారు. ఇలా అన్నీ ఫ్రీ నినాదంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఇక, మేం మాత్రం తగ్గుతామా? అన్నట్టుగా బీజేపీ కూడా ఇదే దూకుడు ప్రదర్శిస్తోంది. వరద బాధిత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌ను నిజమైన భాగ్యనగరంగా చేస్తామని.. పేరు కూడా మార్చుతామని.. సెంటిమెంటును ప్లే చేస్తోంది.
ఇక, రోహింగ్యా ముస్లింలను తరిమి కొడతామని కామెంట్లు కుమ్మరిస్తోంది. మరోవైపు అధికార పార్టీ మంత్రులు దాదాపు 15 మంది వరకు గ్రేటర్‌లో పాగా వేసి.. మరీ ప్రచారం చేస్తున్నారు. మరి బీజేపీ ఊరుకుంటుందా? ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని రంగంలోకి దించేస్తోంది. ఆయన ప్రచారం చేయనున్నారనే వార్తలు రావడంతోనే గ్రేటర్ ఎన్నికల ప్రచారం పీక్‌కు చేరిపోయింది. ఇక, మిగిలింది కేసీఆర్ నిర్ణయం..ఆయన కూడా మోడీ వెళ్లిపోయిన వెంటనే రంగంలోకి దిగుతారని అంటున్నారు.
ఎన్నికలకు ఒక రోజు అంటే 29న సుడిగాలి పర్యటనకు కేసీఆర్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా మొత్తంగా ఈ రెండు పార్టీల దూకుడు బాగున్నా.. ఎవరు గెలుస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ లేక పోవడం గమనార్హం. రెండు పార్టీలపైనా ఇక్కడి ప్రజలు అసహనంతోనే ఉన్నారు. వరదల సమయంలో తమకు ఆపన్న హస్తం అందించలేదని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఇస్తున్న సాయాన్ని సరిగా ఇవ్వడం లేదని.. డబుల్ బెడ్ రూం ఫ్లాట్‌లు ఎప్పుడు ఇస్తారని ప్రభత్వాన్ని నిలదీస్తున్నారు. దీంతో గెలుపు గుర్రం ఎవరు ఎక్కుతారనే విషయం ఆసక్తిగా మారింది.