దేశ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్-2022 నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కేరళలోని ఓ ఎగ్జామ్ సెంటర్‌లో విద్యార్థినుల పట్ల అక్కడున్న సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. లో దుస్తులు విప్పిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు అధికారులు. ఈ ఘటనపై బాధిత విద్యార్థినులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కేరళ కొల్లాంలోని మార్తోమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో నీట్ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ కేంద్రంలో పరీక్షకు హాజరైన సుమారు 100 మంది విద్యార్థినుల పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. అమ్మాయిలందరూ లో దుస్తులు విప్పాలని ఆదేశించిస్తూ అమ్మాయిలను అవమానపరిచే విధంగా ప్రవర్తించారు.
ఎగ్జామ్‌కు సమయం అవుతుండటంతో.. తప్పని పరిస్థితుల్లో విద్యార్థినులందరూ లో దుస్తులు విప్పి.. పరీక్షకు హాజరయ్యారు. అక్కడ ఓ డబ్బాలో లో దుస్తులు ఉంచిన దృశ్యాలు కనిపించాయని పరీక్ష అనంతరం విద్యార్థినులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై పరీక్షా కేంద్రం సిబ్బందిని వివరణ కోరగా.. లో దుస్తులకు బెల్ట్స్ వంటి పరికరాలు ఉండటం వల్లే అలా చేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. అలాగే పరీక్షా కేంద్రంలోని సాధారణ చెప్పులను మాత్రమే అనుమతించారు. ఆభరణాలు, మెటల్ వస్తువులు, ఎలాంటి వాచీలు, కెమెరాలు, టోపీ, బెల్ట్, పర్సు, హ్యాండ్ బ్యాగ్‌లకు అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు విద్యార్థులు.