యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. 2022కి సంబంధించిన ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఇక తొలి నాలుగు ర్యాంకుల్లో అమ్మాయిలే సత్తాచాటారు. దీంతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కూడా మెరుగైన ర్యాంకులు సాధించారు. ఆదిలాబాద్ కు చెందిన డోంగ్రి రేవయ్య అనే యువకుడు సివిల్స్ లో 410 ర్యాంక్ సాధించాడు. చిన్నపుడు తండ్రి చనిపోయాడు. తల్లి ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా చేస్తూ.. కుమారుడిని బాగా చదివించింది. ఈ కష్టాలు.. ఆ యువకుడి అంకితభావం ముందు నిలువలేకపోయాయి. ఈ ర్యాంక్ తో తల్లి కలను సాకారం చేశాడు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇషితా కిశోర్ తొలి ర్యాంకు సాధించగా, తెలంగాణకు చెందిన ఉమా హారతి ఎన్ మూడో ర్యాంకు సాధించారు. మూడో ర్యాంకు సాధించిన నూకల ఉమా హారతి.. నారాయణపేట ఎస్సీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె. ఉమా హారతి స్వస్థలం సూర్యాపేట జిల్లాలోని హుజుర్‌నగర్.సివిల్స్ తుది ఫలితాల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు ఎంపికయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన శాఖమూరి శ్రీసాయి హర్షిత్ 40వ ర్యాంకు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు శివ మారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించారు.