ఏపీలో సీఎం జగన్‌ని ప్రతిపక్షాలు బాగానే ఇబ్బంది పెడుతున్నాయి. కేవలం ప్రతిపక్షాలే కాదు. ప్రతిపక్ష టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు సైతం జగన్‌కు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. జగన్ ఓ వైపు సంక్షేమ పథకాలతో జనం మనసులు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మరో వైపు జగన్‌పై బురదజల్లి, వైసీపీ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయాలని ప్రతిపక్ష టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా గత రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది.
చంద్రబాబు ఎలాగో ప్రతిపక్ష నాయకుడుగా జగన్‌ని ఎలా టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారో అంతా చూస్తూనే ఉన్నారు. ఇక టీడీపీ అనుకూల మీడియా సైతం అదే పనిలో ఉంటుంది. ఎప్పుడు ఏదొక అంశంపై జగన్‌ని ఇరుకున పెట్టడానికే చూస్తుంది. ఈ క్రమంలోనే పలువురు పెద్దలని రాజకీయ విశ్లేషకులుగా డిబేట్లలో కూర్చోబెట్టి జగన్‌పై విమర్శలు చేయించే కార్యక్రమం చేస్తుంది. మొన్నటివరకు సీనియర్ నేత సబ్బం హరి చేత, జగన్‌పై ఎలాంటి విమర్శలు చేయించారో అందరు చూశారు.
అలాగే వైసీపీతో విభేదించి రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజుని డిబేట్లలో కూర్చోబెట్టి పెద్ద రచ్చే చేశారు. అయితే సబ్బం హరి కరోనాతో కన్నుమూశారు. ఇటు రాజుగారు రాజద్రోహం కేసులో జైలుకెళ్లి, బెయిల్ మీద బయటకొచ్చి, లేఖల రాజకీయం చేస్తున్నారు. మీడియాలో మాట్లాడటంపై ఆంక్షలు ఉండటంతో రాజుగారు న్యూస్ చానల్స్‌లో కనబడటం లేదు.
ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావుని టీడీపీ అనుకూల మీడియా హైలైట్ చేస్తుంది. గోనెకు వైఎస్సార్‌తో ఎలాంటి అనుబంధం ఉందో అందరికీ తెలుసు. అలాగే తెలంగాణలో వైసీపీ ఉన్నప్పుడు ఆ పార్టీలో కీలక నేతగా పనిచేశారు. అక్కడ వైసీపీ పని ఖతం అయిపోవడంతో గోనె రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
కానీ అప్పుడప్పుడు విశ్లేషకుడి అవతారమెత్తి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా కూడా బీజేపీ తలుచుకుంటే జగన్ జైలుకెళ్లడం ఖాయమని మాట్లాడారు. అలాగే విజయమ్మ రాసిన నాలో నాతో వైఎస్సార్ పుస్తకంపై కూడా కామెంట్లు చేశారు. పుస్తకంలో వైఎస్సార్ పాదయాత్రకు సంఘీభావంగా జగన్ వచ్చారని రాశారని, కానీ జగన్ రాలేదని, ఒకవేళ అది నిజమని నిరూపిస్తే ఉరేసుకుంటా అని మాట్లాడారు. అయితే అంతకముందు టీడీపీ అనుకూల మీడియా డిబేట్లలో జగన్‌పై నెగిటివ్ కామెంట్లు చేస్తూ వచ్చారు. మొత్తానికైతే గోనె కూడా జగన్‌కు తలనొప్పిగా తయారయ్యారని చెప్పొచ్చు.