ధర్మానకు మళ్లీ మంచి రోజులొచ్చాయా !

-

పార్టీ అధికారంలో ఉంటే.. చోటామోటా నాయకులు ఎక్కడ లేని హడావిడి చేస్తారు. కానీ.. ఆ ఎమ్మెల్యే వీటన్నింటికీ భిన్నం. ఏడాదిన్నరగా మౌనం. తన వంతు రాలేదని అనుకున్నారో.. పార్టీ గుర్తించడం లేదని భావించారో కానీ.. ఆయనకు ఏమైందన్న ప్రచారమైతే నడిచింది. అలాంటి నాయకుడు ఒక్కసారిగా జూలు విదిల్చారు. అందరి దృష్టినీ తనవైపు తిప్పుకొన్నారు.

ధర్మాన ప్రసాదరావు. మాజీ మంత్రి. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే. అపార రాజకీయ అనుభవం కలిగిన ప్రసాదరావును కేబినెట్‌లోకి తీసుకుంటారని భావించారు. కానీ ఆయన అన్న ధర్మాన కృష్ణదాస్‌కు అవకాశం ఇచ్చారు సీఎం జగన్‌. ఇప్పుడు అన్న డిప్యూటీ సీఎంగా ఉంటే.. తమ్ముడు ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. మంత్రి పదవి రాలేదని ఆవేదనో.. తన సీనియారిటీని గుర్తించలేదన్న మనోవేదనో కానీ సైలెంట్‌ అయిపోయారు ధర్మాన ప్రసాదరావు. ఏడాదిన్నరగా ఆయనకేమైంది అని అనుకోవడమే సరిపోయింది. అలాంటి ప్రసాదరావు ఉన్నట్టుండి వెలుగులోకి వచ్చారు.

సీఎం జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లయిన సందర్భంగా పదిరోజులపాటు నిర్వహించిన సంఘీభావ యాత్రలో చురుకుగా పాల్గొన్నారు ధర్మాన ప్రసాదరావు. జిల్లాలో మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు సంఘీభావ యాత్ర చేసినా.. ఒక్క ప్రసాదరావు కార్యక్రమంపైనే ఆసక్తిగా చర్చించుకున్నారు. కాలికి గజ్జె కట్టుకున్నట్టుగా ఊరూవాడా తిరిగిన ఆయన.. ఎమ్మెల్యేగా ఏడాదిన్నర కాలంలో ఏమేమి చేశారో జనాలకు వివరించారు. ప్రభుత్వ పథకాలను ఏకరవు పెట్టారు. ధర్మాన స్టయిలే వేరు అన్నట్టుగా ప్రజలకు ప్రజంటేషన్‌ ఇచ్చారాయన. సంఘీభావ యాత్ర సాగినంత కాలం ప్రతిపక్షాన్ని సైతం తనదైన పదునైన మాటలతో ఓ ఆట ఆడుకున్నారు ధర్మాన ప్రసాదరావు.

2019 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు ప్రసాదరావు. ఆ సమయంలో ధర్మాన స్ట్రాటజీ బాగా పనిచేసిందని పార్టీలోనూ టాక్‌ వినిపించింది. కానీ.. కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో పంథా మార్చేశారు ధర్మాన. మంత్రులు, స్పీకర్‌ ఎవరొచ్చినా దూరంగా ఉండేవారు. తనపనేదో చేసుకుపోయేవారు ఈ మాజీ మంత్రి. కొన్ని సందర్భాలలో స్వపక్షంలో విపక్షంగా మారడంతో ధర్మానపై చర్చ జరిగింది.

ధర్మాన ప్రసాదరావు అంటీముట్టనట్టు ఉండటం.. జిల్లాలో ఇతర వైసీపీ నేతలకు ప్రాధాన్యం దక్కడంతో ఈ మాజీ మంత్రి పరిస్థితి అయిపోయిందని ఒకానొక దశలో చర్చ సాగింది. అయితే వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ సంఘీభావ యాత్ర పేరుతో ధర్మాన బయటకు రావడం.. మునుపటిలా వాగ్బాణాలు సంధించడం కేడర్‌లో జోష్‌ నింపిందట. మా ధర్మానకు టైమొచ్చింది అని చెవులు కొరుక్కుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news