ఏపీ సీఎం జగన్ ఏపీకి కొత్త ప్రాజెక్ట్‌ను సాధించారు. ఎంతో కాలంగా ఏపీ ప్రజలు అందులో కడప చుట్టుపక్కల ప్రజలు ఎదురు చూస్తున్న ప్రాజెక్టు కల నెరవేరనుంది. ఈ ప్రాజెక్టుతో కడప ప్రజల చిరకాల కోరిక నెరవేరినట్టే.. ఇంతకు కడప జిల్లా వాసుల కోసం జగన్ తెచ్చిన ప్రాజెక్టు ఏమిటి అనుకుంటున్నారా ? కడప స్టీల్ ప్లాంట్‌కు ఎన్ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు ఈరోజు అంగీకారం కుదిరింది. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కుశాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో జగన్ భేటీ సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ సీఎం క్యాంపు ఆఫీసులో ఈరోజు కేంద్ర పెట్రోలియం, సహాజవాయువు, ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సంబంధిత అధికారులతో సీఎం వైఎస్.జగన్ సమావేశం నిర్వహించారు. ఎంతో కాలంగా కడప ఇనుప కార్మాగారానికి ఇనుప ఖనిజం సరఫరా అంశం పెండింగ్‌లో ఉంది. గతంలో ఎన్నోసార్లు
కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా అవి నెరవేరలేదు. దీంతో ఇప్పుడు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కడప స్టీల్ ప్లాంట్‌కు ఎన్ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు అంగీకారంతో పాటు త్వరలో ఎన్‌ఎండీసీ, ఏపీ ప్రభుత్వం మధ్య ఎంఓయూ కుదురుతుందని కూడా ఏపీ సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరఫరాకు అంగీకారం తెలపడంతో కడప ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప ప్రజల చిరకాల కోరిక ఈ ఒప్పందంతో తీరబోతుంది. ఇనుప ఖనిజం సరఫరా అయితే వేలాది మంది కార్మికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకనున్నాయి. సీఎం జగన్ కృషితో ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లైంది.