నల్గొండ జిల్లా హాలియాలో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఈ నల్లగొండ పర్యటనలో ఉప ఎన్నికల హామీల అమలుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ… కరోనా కారణంగా జిల్లా పర్యటనకు రావడం ఆలస్యం అయిందని చెప్పారు.
నియోజకవర్గంలో సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయని.. ఇక్కడ మౌలిక సదుపాయాల సమస్యను పరిష్కరించాల్సి ఉందన్నారు. నందికొండ మున్సిపాలిటీలో ఇండ్లను అన్నిటినీ రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు. అలాగే నందికొండ లో స్థలాలు ఉన్న వారికి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గుర్రంపోడు లిఫ్ట్ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
హాలియా మరియు నందికొండ మున్సిపాలిటీలకు… ఒక్కొక్క దానికి 15 కోట్ల చొప్పున నిధులు ఇస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేవరకొండలో కొత్తగా 5 లిఫ్ట్స్, మిర్యాలగూడ నియోజకవర్గంలో 5 లిఫ్ట్స్, అయిటిపాముల, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 15 లిఫ్ట్స్ మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇవన్నీ ఏడాదిన్నర లోపు పూర్తి చేస్తామన్నారు. హాలియాలో మినీ స్టేడియంకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు.