గుడ్‌ న్యూస్‌.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు..

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ సందర్భంగా బోనస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఇబ్బందులకు గురవుతున్న ఉద్యోగులకు కేంద్రం బోనస్‌ ప్రకటించి శుభవార్త చెప్పింది. అయితే కేంద్రం వారికి మరొక శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగనున్నట్లు సమాచారం. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డియర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ)ను నిర్ణయించేందుకు గాను ఇటీవలే కన్‌జ్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ను 2001 నుంచి 2016కు మార్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలు త్వరలోనే పెరుగుతాయని భావిస్తున్నారు.

కాగా ఉద్యోగులు ఏవిధంగా ఖర్చు చేస్తున్నారు, ద్రవ్యోల్బణం ఎలా ఉంది అన్న వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుని డీఏను కేంద్రం నిర్ణయించనుంది. ఇక ఉద్యోగులు వైద్యం, ఇతర ఇంటి ఖర్చులపై పెడుతున్న మొత్తాలను కూడా లెక్కించనున్నారు. దీన్ని బట్టి డీఏను నిర్ణయిస్తారు. అయితే మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 4 శాతం డీఏను పెంచనున్నట్లు ప్రకటించింది. కానీ కరోనా నేపథ్యంలో దాన్ని వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా వేసింది. కానీ ప్రస్తుతం డీఏను 17 శాతం వడ్డీతో చెల్లిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది వరకు ఇదే రేటు కొనసాగనుంది.

ఇక వచ్చే ఏడాది జూన్‌ వరకు కొత్త ప్రైస్‌ ఇండెక్స్‌ ప్రకారం డీఏను పెంచనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా 45 లక్షలకు పైగా ఉద్యోగులకు డీఏ పెరుగుతుంది. అలాగే ప్రైస్‌ ఇండెక్స్‌లో కొంత మార్పు చోటు చేసుకోనున్న కారణంగా దాని ప్రభావం ఉద్యోగుల జీతాలపై పడనుంది. దీంతో వారి జీతాలు కొంత మేర పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది కేంద్రం శుభవార్తలు చెప్పే అవకాశం ఉంది.