మహారాష్ట్రలో గూడ్స్ రైలు బోల్తా పడింది. రైలు పాన్వెల్ నుంచి వసాయ్‌కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. దాంతో కళ్యాణ్, కుర్లా రైల్వే స్టేషన్‌ల నుంచి ఘటనా ప్రాంతానికి యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లను పంపించారు. గూడ్స్ రైలు బోల్తా పడటంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని అధికారులు తెలిపారు. బోల్తా పడిన బోగీలను రైలు పట్టాల పై నుంచి తొలగించిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు. రైలు బోల్తా పడటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
ఇదిలా ఉంటే.. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రైలు పట్టాలపై పడిపోయిన వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. నిజంగా ఇది మిరాకిల్ అనే చెప్పాలి.. ఎందుకంటే.. పెను ప్రమాదం నుండి అతడు అద్భుతంగా బయటపడ్డాడు. రైలు స్టేషన్ నుండి వెళ్లిపోయిన వెంటనే అతడు క్షేమంగా లేచి నిలబడ్డాడు. జరిగిన ఘటనపై పోలీసులు ఆరా తీశారు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లోని బగాహ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఉన్న గ్యాప్‌లో పడిపోయాడు. రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఆ వ్యక్తి రైలు పట్టాలపైకి దిగినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు అధికారి ఈ విషయాన్ని గమనించి అతనికి సాయం చేశారు.