గూగుల్‌పై భారత్ రూ.936 కోట్ల ఫైన్.. ఆ సంస్థ రియాక్షన్ ఏంటంటే..?

-

ప్లే స్టోర్ విధానాల్లో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని గూగుల్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.936.44 కోట్ల జరిమానా విధించింది. నైతిక వ్యాపార కార్యకలాపాల నిరోధానికి చర్యలు చేపట్టాల్సిందిగా, నిర్దేశిత సమయంలోగా తన ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా గూగుల్‌ను ఆదేశించింది. గూగుల్‌పై సీసీఐ కొరడా ఝుళిపించడం గత రెండు వారాల్లో ఇది రెండో సారి కావడం గమనార్హం.

జరిమానాపై గూగుల్ స్పందించింది. తాము అనుసరిస్తున్న విధానాలు డిజిటల్‌ భారత్‌ అవతరణకు దోహదం చేశాయని తెలిపింది. డిజిటల్‌ కార్యకలాపాలు విస్తరించడంలోనూ గూగుల్‌ చర్యలు ఉపకరించాయని పేర్కొంది. తమ వినియోగదారులు, డెవలపర్లకు తాము మెరుగైన సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.

‘‘మా వినియోగదారులు, డెవలపర్లకు మెరుగైన సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నాం. సీసీఐ తీసుకున్న నిర్ణయంపై ఎలా ముందుకు వెళ్లాలని మేం సమీక్షించుకుంటున్నాం. ఆండ్రాయిడ్‌, గూగుల్ ప్లే అందించే సాంకేతికత, భద్రత, వినియోగదారు రక్షణలు, అసమానమైన ఎంపికలు, సౌలభ్యం నుంచి భారతీయ డెవలపర్లు ప్రయోజనం పొందారు. ఖర్చులను తక్కువగా ఉంచడం ద్వారా, మా మోడల్ భారతదేశ డిజిటల్ పరివర్తనకు శక్తినిచ్చింది. కోట్ల మందికి డిజిటల్‌ మాధ్యమాలను విస్తరించింది’’ అని గూగుల్‌ అధికార ప్రతినిధి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news