హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా ఈ వివాదంపై మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ భూములనుప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు వ్యక్తిపరం అవుతున్న భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుందని వెల్లడించారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
“ఏఐ ఫేక్ వీడియోలు చూసి రాష్ట్ర ప్రజలే కాదు ప్రధాని మోదీ కూడా పొరపాటుపడ్డారు. ఫేక్ వీడియోలు అని తెలిశాక.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎక్స్‌లో పెట్టిన వీడియోలు తొలగించారు. ఇక ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఏ ఉద్దేశంతో రీట్వీట్ చేసిందో ఆమెకే తెలియాలి. ఆమెది తొందర పాటు తప్ప ఏమీ లేదు. గతంలో కూడా ఆమె లేని కారుకు రెంట్ తీసుకుంటే యూనివర్సిటీ నుంచి నోటీసులు కూడా వచ్చాయి. ఆమెనే అడగండి అసలు ఎందుకు రీట్వీట్ చేశారు అని. కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రి తెలియక రీట్వీట్ చేసి అది తప్పు అని తెలియడంతో వీడియో తొలగించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.’’ అని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు.