బలవంతపు మత మార్పిడిలకు వ్యతిరేకంగా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్సును యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదించారు. ఇది అమలులోకి వస్తే బలవంతంగా మత మార్పిడిని ప్రోత్సహించే వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడనుంది.
యోగి ఆదిథ్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ నవంబర్ 24న ఈ ఆర్డినెన్సును ఆమోదించింది. ఈ ఆర్డినెన్స్ అమలులోకి వస్తే బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడేవారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడనుంది. మత మార్పిడి కోసమే వివాహం చేసుకున్నట్లైతే.. ఆ వివాహాన్ని చెల్లుబాటు కానిదిగా పరిగణిస్తారు. ఇటీవలి కాలంలో భాజపా పాలిత రాష్ట్రాలైన ఉత్తర్ప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ తరహా ఆర్డినెన్సులు తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. ప్రేమ, పెళ్లి పేరిట హిందు మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మారేలా చేస్తున్నారని, వాటిని అరికట్టేందుకు ఈ ఆర్డినెన్సులు ఉపయోగపడతాయని చెబుతున్నాయి. ఈ బలవంతపు మత మార్పిడులనే ‘లవ్ జిహాద్’గా అభివర్ణిస్తున్నాయి.
‘యూపీ ప్రొహిబిషన్ ఆఫ్ అన్ లా ఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజన్ ఆర్డినెన్స్-2020’గా దీన్ని వ్యవహరిస్తున్నారు. లవ్ జిహాద్ కు అడ్డుకట్ట వేసేందుకు, బలవంతపు మతమార్పిడిని నివారించేందుకు ఈ కొత్త చట్టం దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. చట్ట వ్యతిరేకమైన మత మార్పిడిలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తేవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించిందని మంత్రి సిధ్ధార్త్ నాథ్ సింగ్ తెలిపారు. మైనర్ బాలికలను, ఎస్సీ, ఎస్టీ యువతులను మభ్య పెట్టి పెళ్లి చేసుకుని బలవంతంగా మత మార్పిడి చేస్తే ఇందుకు కారకులైనవారికి మూడేళ్ళ నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష, 25 వేల రూపాయల జరిమానా విధించనున్నారు. సామూహిక మత మార్పిడుల విషయంలో ఇంతే జైలుశిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధిస్తారు. ఈ చట్టం కింద.. ఇక ఇలా జరిగే ఏ పెళ్ళినైనా చెల్లనిదిగా ప్రకటిస్తారు. అయితే వివాహం తరువాత మతం మార్చుకోవాలి అని అనుకునే వాళ్లు జిల్లా మేజిస్ట్రేట్ కి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. దేశంలో లవ్ జిహాద్ కి వ్యతిరేకంగా చట్టం తెచ్చిన మొదటి రాష్ట్రం యూపీయే అయింది. ఇప్పటికే పలు సంస్థలు, సంఘాలు ఇలాంటి చట్టం అవసరమని డిమాండ్ చేస్తున్నాయి.