టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే గవర్నర్ పై నిందలు వేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం, గవర్నర్ సఖ్యతతో ఉండాలని అన్నారు. గవర్నర్ ఢిల్లీ పర్యటనలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 8ని ఉపయోగించి విశేషాధికారాలను గవర్నర్ ఉపయోగించాలని కోరారు. హైదరాబాద్ డ్రగ్స్ విషయంలో చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేయని ఏ పనినైనా గవర్నర్ చేయవచ్చని ఆయన అన్నారు. గవర్నర్ బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి అంటూ టీఆర్ఎస్ పార్టీ చేసిన విమర్శలపై కూడా ఆయన స్పందించారు. గతంలో రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పోటీ చేసినప్పుడు ఏ పార్టీకి చెందిన వారని ఓటేశారని… ఆ ఎన్నికల్లో లేని అభ్యంతరం గవర్నర్ విషయంలో ఎందుకు వచ్చిదంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబ సమస్యల్లో ఉన్నారు… ఆ సమస్యల నుంచి బయట పడే పనిలో ఆయన ఉన్నారని గవర్నర్ చెప్పారని అన్నారు. గవర్నర్ తో సఖ్యత లేనప్పుడు కేటీఆర్ ను సీఎం చేసే అవకాశం లేదని…అందుకే గవర్నర్ ను ఒప్పించే పనిలో ఉన్నారని అన్నారు. విద్యా, వైద్య రంగాలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఆస్పత్రుల్లో కుక్కలు, పిల్లులు పెత్తనం చెలాయిస్తూన్నాయంటే.. ఆరోగ్య వ్యవస్థ ఏ పరిస్థితుల్లో ఉందనేది అర్థం అవుతుందని…గవర్నర్ అధికారాలను ఉపయోగించి అన్నింటిని సరిదిద్దాలని రేవంత్ రెడ్డి కోరారు.
కుటుంబ సమస్యల్లో కేసీఆర్… కొడుకును సీఎం చేయడానికి గవర్నర్ పై ఒత్తడి: రేవంత్ రెడ్డి
-