నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి మీద జరిగిన దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ దాడిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లోని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేయటం.. వాళ్ల ఇంట్లో సభ్యులను భయబ్రాంతులకు గురి చేయటం.. ఇంట్లో వస్తువులను ధ్వసం చేయటాన్ని గవర్నర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటులేదని స్పష్టం చేశారు. ఈ దాడిని సీరియస్‌గా తీసుకున్న గవర్నర్ తమిళిసై.. ఈ ఘటనపై రిపోర్టు ఇవ్వాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. తమిళిసై కార్యాలయ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు.. హైదరాబాద్‌లోని ఎంపీ ఇంటిపై దాడి చేసిన సంగతి తెలిసిందే.
కల్వకుంట్ల కవితను బీజేపీలోకి రమ్మన్నారంటూ టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రస్తావించగా.. దానిపై ఎంపీ అర్వింద్ స్పందిస్తూ.. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ కామెంట్లు అనుచితంగా ఉన్నాయంటూ.. ఆగ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఏకంగా ఆయన ఇంటిపైనే దాడి చేశారు. దాడి జరిగిన కాసేపటికే.. ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గీత దాటి మాట్లాడితే.. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో.. తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఈ ఘటనపై ఇరు పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగాల్సి వచ్చిందని అటు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే దాడులకు దిగుతున్నారంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.