టాలీవుడ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్, మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్నారు. చరణ్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారని చెప్పొచ్చు. ఈ పిక్చర్ లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కు మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సంగతులు పక్కనబెడితే రామ్ చరణ్ ఆఫ్ స్క్రీన్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు.
హీరోగా వెండితెరపైన అద్భుతమైన, ఆదర్శవంతమైన డైలాగ్స్ చెప్పడమే కాదు.. బయట కూడా తనకు తోచినంతలో సాయం చేస్తున్నారు. తండ్రి చిరంజీవి నుంచి వచ్చిన గుణాలే ఏమో తెలియదు. కానీ, చరణ్ సైతం తన వంతుగా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూతురుకు అత్యవసర ట్రీట్ మెంట్ టైంలో రామ్ చరణ్ వెంటనే స్పందించారు. అలా చాలా మంది సహాయం చేస్తుంటారు చరణ్.
తాజాగా రామ్ చరణ్ చేసిన సాయం గురించి ‘మనం సైతం’ నిర్వాహకులు కాదంబరి కిరణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘కొద్ది రోజుల కిందట ఒక అసిస్టెంట్ భార్య చనిపోయినప్పుడు, బిల్లు కట్టేసి శవాన్ని తీసుకుని వెళ్లాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. ఆ టైంలో అతని వద్ద డబ్బులేదు. సుకుమార్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ వెంటనే రూ.2 లక్షలు సాయం చేశారు. ‘మనం సైతం’ ఫౌండేషన్ ద్వారా మిగతా కార్యక్రమాలు పూర్తి చేశాం’ అని కాదంబరి కిరణ్ చెప్పారు.
చనిపోయిన ఆమెకు రెండేళ్ల పాప ఉండగా, ఆమె పేరిట కొంత డబ్బు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశామని, అందుకు ఆర్థిక సాయం సుకుమార్ తో పాటు ఇంకొందరు చేశారని కాదంబరి కిరణ్ వివరించారు. ఇటీలవ తనకు ఓ సందర్భంగా రామ్ చరణ్ కలిసినపుడు ఆ పాప ఎలా ఉందని, ఏం చేస్తుందని అడిగారని, అలా అడగడం తనకు సంతోషంగా అనిపించిందని ఆనందపడ్డారు కాదంబరి.
సాయం చేసిన విషయం గుర్తుపెట్టుకుని, ఆ పాప గురించి ఆరా తీయడం రియల్లీ గ్రేటని అన్నారు. ‘బంగారు’ చెంచాతో పుట్టడం కాదు.. ‘బంగారం’ వంటి మనసుతో బతుకడం ముఖ్యమని రామ్ చరణ్ చూస్తే అనిపిస్తుందని పేర్కొన్నారు. మంచి మనసున్న వ్యక్తియే కాదు.. గొప్ప మనిషి, మానవత్వం కలిగిన వారు రామ్ చరణ్ అని చెప్పారు కాదంబరి కిరణ్.