నగరంలో పట్టుసాధించడం ఒక ఎత్తు అయితే.. తెలంగాణలో బలపడాలంటే GHMCలో BJP జెండా ఎగరేడం అంతే ముఖ్యమనే ఆలోచనలో ఉంది బీజేపీ అధిష్టానం.ఎన్నికల్లో కీలక బాధ్యతలను కేంద్రమంత్రి హోదాలో కిషన్ రెడ్డికి కట్టబెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల రూపంలో పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కిందటి GHMC ఎన్నికల్లో ఏదో అనుకున్నా.. సిటీలో BJP సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. ఇప్పుడు అలా కాదు. నగరంలో పట్టుసాధించడం ఒక ఎత్తు అయితే.. తెలంగాణలో బలపడాలంటే GHMCలో BJP జెండా ఎగరేడం అంతే ముఖ్యమనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఈ ఎన్నికలు బీజేపీతోపాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కూడా సవాల్ విసురబోతున్నట్టు పార్టీ వర్గాలు గుస గుసలాడుకుంటున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే కిషన్‌రెడ్డి చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఇది పైకి అనుకున్నంత ఈజీ కాదు. పైగా ఎమ్మెల్యే రాజాసింగ్‌కు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పడదనే టాక్ పార్టీ వర్గాల్లో ఉంది. పాతబస్తీలో పట్టు బిగించాలంటే రాజాసింగ్‌ను కలుపుకొని వెళ్లడం ముఖ్యం. అయితే కేంద్రమంత్రి ముందుగా నేతలను, కార్యకర్తలను సమన్వయ పరిచే పనులను సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మొదలుపెట్టారు. అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో గ్రేటర్ పై ఎక్కువ ఫోకస్ పెట్టిన కేంద్రమంత్రి అధికార పార్టీ పై పదునైన విమర్శలు చేస్తున్నారు. క్రమంగా బీజేపీ శ్రేణుల్లో చురుకు తీసుకొస్తూనే.. రాజకీయంగా వేడి రగిలిస్తున్నారు. మరి.. రచ్చ గెలిచిన కిషన్‌రెడ్డి ఇంట గెలుస్తారో లేదో చూడాలి.