ఐపీఎల్ సీజన్ 2022 ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ రసవత్తరంగా సాగుతోంది. నేడు ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే గుజరాత్ ప్లేఆఫ్ చేరగా.. ఆర్‌సీబీ వరుస పరాజయాలతో ప్లేఆఫ్ ఆశలు గల్లంతు చేసుకుంది. నేటి మ్యాచ్‌లో గుజరాత్‌ను భారీ తేడాతో ఓడిస్తేనే ఆర్‌సీబీకి ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి. అయితే బ్యాటింగ్ దిగిన గుజరాత్ జట్టు ఆటగాళ్లు.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అర్ధసెంచరీ, రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ సాయంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది.
పాండ్యా 47 బంతుల్లో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాండ్యా స్కోరులో 4 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. ఆఖర్లో వచ్చిన రషీద్ ఖాన్ చిచ్చరపిడుగులా చెలరేగడంతో గుజరాత్ స్కోరు 150 మార్కు దాటింది. రషీద్ ఖాన్ కేవలం 6 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు చేశాడు. అంతకుముందు, ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 31, డేవిడ్ మిల్లర్ 34 (3 సిక్సర్లు) పరుగులతో రాణించారు. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (1) విఫలం కాగా, మాథ్యూవేడ్ 16 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజెల్ వుడ్ 2, మ్యాక్స్ వెల్ 1, హసరంగ 1 వికెట్ తీశారు.