కొలువుదీరిన గుజ‌రాత్ కొత్త కేబినెట్.. 24 మంది మంత్రులతో ఏర్పాటు

Gujarat Cabinet Ministers: ప్ర‌ధాని మోడీ స్వ‌రాష్ట్రం గుజ‌రాత్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. నూత‌న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్ ఆధ్వ‌ర్యంలో నూత‌న కేబినేట్ గురువారం ప్ర‌మాణ స్వీకారం చేసింది.24 మంది మంత్రులతో నూత‌న కేబినేట్ ఏర్పాటైంది.

మాజీ అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు జితు వాఘని, స‌హా రుషికేష్ పటేల్, పూర్ణేష్ మోడీ, రాఘవ్‌జీ పటేల్, కనుభాయ్ దేశాయ్, కిరిత్సింహ్ రాణా, నరేశ్‌ పటేల్, ప్రదీప్ పర్మార్, అర్జున్‌సింగ్‌ చౌహాన్ లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో 10 మంది కేబినెట్ మంత్రులుగా, 14 మంది సహాయ మంత్రులుగా, సహాయ మంత్రుల్లో ఐదుగురు స్వతంత్ర హోదాగల మంత్రులుగా నియ‌మితుల‌య్యారు. వీరిచే గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, సీఎం భూపేంద్ర పటేల్ ఇత‌ర రాజకీయ ప్ర‌ముఖులు హాజరయ్యారు. గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు నూత‌న సీఎం భూపేంద్ర పటేల్ అధ్యక్షతన మొదటి కేబినెట్ సమావేశం జ‌రుగ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే.. మాజీ సీఎం విజయ్ రూపానీ మంత్రివర్గంలో పనిచేసిన ఏ ఒక్క మంత్రికి చోటు లేక‌పోవ‌డం గ‌మ‌న్హారం.