కాల్పుల అగ్రరాజ్యం అమెరికా దద్దరిల్లుతోంది. నిన్న పలుచోట్ల జరిగిన కాల్పుల్లో 11 మంది మృత్యువాతపడిన ఘటన మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. వాషింగ్టన్ స్టేట్లో యకిమా నగరంలోని కన్వీనియన్స్ స్టోర్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ వ్యక్తి స్టోర్లో ఉన్న వ్యక్తులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే.. నిన్న శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బేలోని రెండు చోట్ల దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఇందులో రెండు కాల్పులు జరిగాయి. ఏడుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయోవాలోని డెస్ మోయిన్స్‌లోని యూత్ ఔట్‌రీచ్ సెంటర్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం కాలిఫోర్నియా మాంటెరీ పార్క్ లో దుండగుడి కాల్పుల్లో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. చైనా ల్యూనార్ న్యూ ఇయర్ వేడులకు టార్గెట్ గా చేసుకుని దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఆ తరువాత నిందితుడు తనను తాను కాల్చుకుని మరణించాడు. అమెరికాలో గన్ కల్చర్ పెరుగుతోంది. గన్ వయలెన్స్ ఆర్కైవ్ వెబ్‌సైట్ ప్రకారం, గత ఏడాది 647 సామూహిక కాల్పుల సంఘటనలు జరిగాయి. 2022లో 44,000 మంది తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. ఇందులో సగాని కన్నా ఎక్కువగా ఆత్మహత్యలే ఉన్నాయి.