వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్ఠానం అవకాశమిస్తే తన తనయుడు అమిత్ పోటీలో ఉంటారని, ఒకవేళ టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తారన్నారు. ఎమ్మెల్సీగా తనకు మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉందని, ఈ నేపథ్యంలో పోటీ చేయనని చెప్పారు. ఆయన శాసన మండలిలోని తన ఛాంబర్ లో మీడియాతో మాట్లాడుతూ… రాజకీయాల్లో వారసత్వం కేవలం ఎంట్రీ కార్డు మాత్రమే అని, వ్యక్తిగతంగా ప్రజల మద్దతు పొందితేనే భవిష్యత్తు ఉంటుందన్నారు.
జనంలో ఉన్న నేతలు పార్టీని విడితే నష్టమేనని పేర్కొన్నారు. మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. రాష్ట్రంపై కేసీఆర్‌కు ఉన్న అవగాహన ఎవరికీ లేదని చెప్పారు. కాంగ్రెస్ నేతలు తమకు తాము పెద్దగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయితే కేటీఆర్ మంత్రిగా ఉంటారని తెలిపారు. రాజకీయాల్లో వందశాతం ఎవరిపైనా సంతృప్తి ఉండదు.. ఇది సహజం అన్నారు. ఎన్నికలు వచ్చే వరకు కాంగ్రెస్, బీజేపీలు కిందకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. 2018 ఎన్నికల్లో పొంగులేటి బీఆర్ఎస్‌లో ఉండి ఎన్ని గెలిపించారని ప్రశ్నించారు. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ లేకపోవడంతోనే బిహార్ విపక్షాల మీటింగ్‌కు ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు.