సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నార్కెట్‌పల్లి మండలం కేంద్రంలో జరిగిన సాగునీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష కారణంగా వెనుకబడ్డ తెలంగాణలో ముఖ్యమంత్రి 9సంవత్సరాల కాలంలోనే అనేక అద్భుత ఫలితాలు సాధించి దేశంలోనే నెంబర్‌వన్ తెలంగాణగా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ,అలాంటి కృషి పట్టుదల గల నాయకుడికి వెన్నుదన్నుగా రైతులు నిలవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
వేసవిలో సైతం మత్తడి దుంకుతూ అలుగెల్లుతున్న చెరువులూ, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్లకు చేరుతున్న నదీజలాలు సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాయన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగం స్వర్ణయుగాన్ని తలపిస్తున్నదని తెలిపారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా సాక్షాత్కరిస్తున్నదని అన్నారు.