జనవరి 1వ తేదీ నుంచి దేశంలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్‌ను కేంద్ర రోడ్డు రవాణా శాఖ తప్పనిసరి చేసింది. దీంతో ఆ తేదీ నుంచి వాహనదారులు జాతీయ రహదారులపై ప్రయాణిస్తే టోల్ ప్లాజాల ద్వారా వెళితే కేవలం ఫాస్టాగ్ ద్వారానే టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ నిర్ణయానికి గాను గతంలో పలు గడువు తేదీలను ఇచ్చినా కరోనా వల్ల దాన్ని జనవరి 1, 2021కి మార్చారు. అందువల్ల ఆ తేదీ నుంచి వాహనదారులు తప్పనిసరిగా ఫాస్టాగ్‌ను వాడాల్సి ఉంటుంది.
అయితే ఫాస్టాగ్ విషయంలో ఇప్పటికీ అనేక మందికి పలు సందేహాలు ఉన్నాయి. అవేమిటో, వాటికి సమాధానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అసలు ఫాస్టాగ్ (FASTag) అంటే ఏమిటి ?
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు, వాహనదారులు గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండకుండా వేగంగా ప్రయాణాలు చేసేందుకు, నగదు లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టింది. ఇందుకు గాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నేషషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ఫాస్టాగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా వాహనం రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్‌ను వాహనం ముందు అద్దం లేదా సైడ్ మిర్రర్‌పై స్టిక్కర్‌లా అతికిస్తారు. ఈ క్రమంలో వాహనం టోల్ ప్లాజా ద్వారా వెళ్లినప్పుడు అక్కడే పై భాగంలో ఉండే ప్రత్యేక యంత్రం సదరు బార్‌కోడ్‌ను ఆటోమేటిగ్గా రీడ్ చేస్తుంది. ఈ క్రమంలో బార్ కోడ్‌కు అటాచ్ అయి ఉండే ప్రీపెయిడ్ డిజిటల్ వాలెట్‌లో నుంచి టోల్ ఫీజు ఆటోమేటిగ్గా కట్ అవుతుంది. దీంతో టోల్ ప్లాజాల గుండా వేగంగా వెళ్లవచ్చు. నగదు చెల్లించాల్సిన పనిలేదు. చిల్లర సమస్య ఉండదు. ఆటోమేటిగ్గా టోల్ చెల్లింపులు జరుగుతాయి.
2. ఫాస్టాగ్‌ను ఎలా తీసుకోవాలి ?
ప్రస్తుతం అనేక బ్యాంకులు పేటీఎం వంటి డిజిటల్ వాలెట్లు ఫాస్టాగ్‌ను అందిస్తున్నాయి. వాటిల్లో వాహనం వివరాలను నమోదు చేసి సంబంధిత కేవైసీ పత్రాలతో ఫాస్టాగ్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో పత్రాల వెరిఫికేషన్ పూర్తయి ఫాస్టాగ్ వస్తుంది. ఇంటికే ఫాస్టాగ్ స్టిక్కర్ డెలివరీ అవుతుంది. దాన్ని వాహనంపై నిర్దిష్టమైన భాగంలో అతికించాలి. ఇక ఫాస్టాగ్‌కు కనెక్ట్ అయి ఉండే డిజిటల్ వాలెట్‌లో నగదును లోడ్ చేయాలి. దీంతో టోల్ ప్లాజాల గుండా వెళ్లినప్పుడు నగదు ఆటోమేటిగ్గా కట్ అవుతుంది.
3. ఫాస్టాగ్‌కు ఎంత ఖర్చవుతుంది ?
బ్యాంకులు లేదా డిజిటల్ వాలెట్లను బట్టి ఫాస్టాగ్‌ను తీసుకునే రుసుం మారుతుంది. ఉదాహరణకు పేటీఎం అయితే రూ.500 తో ఫాస్టాగ్ తీసుకోవచ్చు. అందులో రూ.250 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌గా ఉంటుంది. మరో రూ.150 మినిమం బ్యాలెన్స్ ఉంటుంది. ఇక ఐసీఐసీఐ అయితే ఫాస్టాగ్‌ను ఇష్యూ చేసేందుకు రూ.99 చార్జి చేస్తోంది. అందులో కనీసం రూ.200 డిపాజిట్ చేయాలి. రూ.200 మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. ఇలా భిన్న రకాల బ్యాంకులు, డిజిటల్ వాలెట్లు భిన్న రకాల ఫీజులను వసూలు చేస్తున్నాయి. అయితే కొన్నింటిలో ఫాస్టాగ్‌ను తీసుకుంటే క్యాష్ బ్యాక్ వంటి సౌకర్యాన్ని అందిస్తున్నారు.
4. ఫాస్టాగ్‌ను ఎలా రీచార్జి చేసుకోవాలి ?
ఫాస్టాగ్ డిజిటల్ వాలెట్‌ను క్రెడిట్, డెబిట్ కార్డులు లేదా యూపీఐ, నెట్‌బ్యాంకింగ్ వంటి సదుపాయాలతో రీచార్జి చేసుకోవచ్చు. కొన్నింటిలో పేటీఎం, ఫోన్ పే వంటి సదుపాయాలను కూడా అందిస్తున్నారు. బ్యాంకులు తమ సొంత వాలెట్ల ద్వారా ఫాస్టాగ్ వాలెట్‌ను రీచార్జి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.
5. ఫాస్టాగ్ వాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది ?
ఫాస్టాగ్‌ను తీసుకున్న తేదీ నుంచి 5 ఏళ్ల వరకు పనిచేస్తుంది. అప్పటి వరకు ఫాస్టాగ్ డిజిటల్ వాలెట్‌లో నగదును రీచార్జి చేసుకుంటూ ఉపయోగించుకోవచ్చు. తరువాత రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.