ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సంస్థలు ఆర్థిక మాంద్యం భయంతో భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఎరిక్సన్, ట్విటర్, అమెజాన్ వంటి సంస్థలు ఇప్పటికే పెద్ద ఎత్తున లేఆఫ్ లు ప్రకటించిన విషయం తెలిసిందే. లేఆఫ్స్ ప్రకటించడమే కాదు.. కొంతకాలం పాటు ఉద్యోగ నియామకాలు నిలిపివేసినట్లు ప్రకటించాయి.
ఇదిలా ఉంటే.. మరోవైపు హెచ్‌సీఎల్ కంపెనీ రూట్ మార్చింది. భారీ లేఆఫ్స్ వేళ.. కీలక ప్రకటన చేసింది. ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్నా.. ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రకటించింది. రాబోయే రెండేళ్లలో సుమారు 1,000 ఉద్యోగ నియామకాలు చేపడతామని వెల్లడించింది. అయితే.. ఈ నియామకాలు రొమేనియాలో ఉంటాయని తెలిపింది.
ఐదేళ్లుగా హెచ్‌సీఎల్ సంస్థ రొమేనియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో టెక్నాలజీ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి తమ సంస్థ శిక్షణ ఇచ్చి ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తుందని ప్రకటించింది. ఇందుకోసం రోమేనియన్ యూనివర్శిటీతో ఒప్పందం చేసుకున్నట్లు హెచ్‌సీఎల్ కంపెనీ తెలిపింది.