ఆ అధికారులను జైలుకు పంపాలి : ఏపీ హైకోర్టు

-

కోర్టు ధిక్కరణ అంశంపై ఏపీ హైకోర్టు మండిపడింది. ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తేనే అధికారులు స్పందించి పనులు చేస్తున్నారని విచారణ సందర్భంగా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రెండు వేర్వేరు కోర్టు ధిక్కరణ కేసుల్లో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు.

దంత వైద్య కళాశాలలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న అరుణ అనే మహిళ.. తనకు 2018 నుంచి జీతం ఇవ్వట్లేదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జీతం ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు అమలు చేయడం లేదని కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం సీఎంవో కార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్య, హెల్త్‌ యూనివర్సిటీ వీసీ బాబ్జీ కోర్టుకు హాజరయ్యారు.

ఒప్పంద ఉద్యోగి అరుణకు హెచ్‌ఆర్‌ఏ, డీఏతో కలిపి పూర్తి వేతనం చెల్లించకుండా.. కొంత మొత్తం ఎలా చెల్లిస్తారని హైకోర్టు అధికారులను ప్రశ్నించింది. ఇన్నేళ్లు జీతం ఇవ్వకపోతే అమెకు జీవనోపాధి ఎలా అని నిలదీసింది.  అధికారులు ఈ విధంగా వ్యవహరించడం సరికాదని, కోర్టు ధిక్కరణకు పాల్పడే అధికారుల కోసం హైకోర్టులో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి జైలుకు పంపించాల్సి వస్తుందేమోనని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Latest news