చింతగింజలతో ఇన్ని ప్రయోజనాలా?

-

చింతకాయలతో తెలుగు ప్రజలు తొక్కు పెట్టుకుంటారు. లేదా చిన్న చింతకాయలు పుల్లపుల్లగా ఉంటాయి కాబట్టి నూరూరిస్తూ తింటుంటారు. చింతపండు కూరలకు ఉపయోగిస్తారు. ఇలా ఈ రకంగానే ఉపయోగిస్తామని తెలుసు గాని వాటిలో ఉండే చింతగింజలతో ప్రయోజనం ఉందని తెలిస్తే ఎందుకు పారేస్తామంటున్నారు నేటితరం. అయితే వీటి ఉపయోగాలేంటో తెలుసుకుందాం.

శీతాకాలంలో రైతులు పంటలు వేస్తారు. అదే సమయంలో చింతచెట్లు పూతవేసి చిన్న పిందులుగా వస్తుంటాయి. ఆ తర్వాత వాటి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అలా పంటకోతకు వచ్చేటప్పటికి చింతకాయలు పండుమాగుతుంటాయి. మార్చి, ఏప్రిల్‌కు పండుమాగి చెట్టు నుంచి కింద రాలడం స్టార్ట్‌ అవుతుంది. ఆ పండు చింతకాయలను సేకరించి ఎండబెడుతారు. కొన్నిరోజులు ఎండిన తర్వాత వాటి పొట్టుతీసి రెండురోజులు ఎండబెడతారు. కాసే ఎండను బట్టి చింతపండు రంగు మారిపోతుంది. మరీ నల్లగా మారకుండా చూసుకుంటూ ఉండాలి. ఎండిన తర్వాత రాయి మీద చింతకాయ పెట్టి సుత్తితో కొడితే ఆ చింత గింజలు బయటకు వస్తాయి. కొంతమంది దబ్బనంతో ఒక్కో చింతకాయ పట్టుకొని విత్తనాలు బయటకు తీస్తారు. విత్తులు తీసిన దాన్ని కాసేపు ఆరబెడితే చాలు మార్కెట్లో కొనుగోలు చేసే చింతపండు తయారయినట్లే. తీరా చింతపండు నుంచి వచ్చిన చింతగింజలన్నీ ఏరి బయట పడేస్తారు. అలా చేయడం కన్నా కొన్ని పనులు చేస్తే వాటిని తినడమే కాకుండా ఆరోగ్యం కాపాడుకున్న వాళ్లమవుతాం

ఉపయోగాలు..

– చింతగింజలకు జిగురు పోయేలా శుభ్రం చేయాలి. వాటిని ఆరబెట్టి కడాయిలో వేయించాలి. ఆ తర్వాత రోట్లో వేసి ఎగిరిపోకుండా దంచితే కొంతమేరకు పొట్టు పోతుంది. వాటిని నీటిలో రెండు రోజుల పాటు నానబెట్టాలి. పూటకు ఒకసారి అయినా నీరు మారుస్తూ ఉండాలి. అలా రెండు రోజులు అయ్యాక వాటిని తీసుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎండాకాలంలో నానిన చింతగింజలు తినడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది.

– చింతగింజలను వేయించిన తర్వాత పొడి చేసుకోవాలి. ఆ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి మౌత్‌వాష్‌లా ఉపయోగిస్తే నోటి దుర్వాసన పోతుంది.

– ఈ పొడిని గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. చింతగింజల పొడిని రోజుకు రెండుసార్లు అరటీస్పూన్‌ చొప్పున పాలు, నీటితో చక్కెర కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

– ఇలా తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, గొంతు సంబంధి సమస్యలున్నవారు ఈ పొడిని నీళ్ళలో కలుపుకొని తాగితే సమస్య తగ్గుతుంది. ఎముకలకి బలం ఇచ్చే శక్తి చింతగింజలకు ఉంది.

– ఎముకలు విరిగితే ఆ ప్రదేశంపై చింతగింజల పొడిని పేస్టులా చేసి ఐప్లె చేస్తే పరిష్కారమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news