గుండెపోటు.. చిన్న పిల్లల నుంచి టీనేజ్, మధ్య వయస్కులు, వృద్ధులను భయపెడుతున్న సమస్య. ఈ మధ్య గుండెపోటుకు ఎక్కువగా యుక్త వయసులో ఉన్న వాళ్లే బలవుతున్నారు. చిన్న పిల్లల్లను కూడా ఇది భయపెడుతోంది. తాజాగా గుండెపోటుతో ఓ 12 ఏళ్ల బాలుడు మరణించిన ఘటన కర్ణాటకలోని మడికేరి జిల్లాలో చోటుచేసుకుంది.
అప్పటి వరకు కన్నవారి కళ్లముందే హుషారుగా ఆడుకున్న పన్నెండేళ్ల బాలుడు ఒక్కసారిగా గుండెపోటుతో విలవిల్లాడిపోయాడు. తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ఆ చిన్నారి ప్రాణం దక్కలేదు. కర్ణాటకలోని మడికేరి జిల్లా కుశాలనగర తాలూకా కూడుమంగళూరులో పాఠశాల బస్సు డ్రైవర్‌గా పని చేసే మంజాచారి కుమారుడు కీర్తన్ ఆరో తరగతి చదువుతున్నాడు.
శనివారం సాయంత్రం ఆడుకుని, రాత్రి కావస్తుండటంతో ఇంట్లోకి వచ్చాడు. కాసేపటికి గుండెలో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పి బాధతో తల్లడిల్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే కుశాలనగర ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. గుండెపోటువల్ల అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. కీర్తన్‌కు ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని బంధువులు తెలిపారు.