మరో మూడు రోజులు భారీ వర్షాలు..ముప్పు తప్పదా…!

-

తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. మరో మూడు రోజుల పాటు ఏపీ..తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు..ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయాలని ఆదేశించారు. వారం రోజులుగా వరద, బురదతో అవస్ధలు పడుతున్నారు జనం. శనివారం నాటి వర్షంతో నగరవాసులకు ఇబ్బందులు మరింత పెరిగాయి. రానున్న వర్ష సూచనపై భయాందోళనలు పెరుగుతున్నాయి. తెలంగాణలోని మిగతా జిల్లాల్లోనూ పలుచోట్ల వచ్చే రెండు రోజులు భారీ వానలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌కు మరో వాయుగుండం పొంచి ఉంది. ఇప్పటికే గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news